Skip to main content

Namaste NRI

గాంధీ కుటుంబ విషాదాల వెనుక ‘మిస్టీరియస్ ఫారినర్’?

రాజకీయాల్లో తనదైన దూకుడుతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ పెను దుమారమే రేపారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీ కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాదాలు, వారసుల మరణాలు కేవలం యాదృచ్ఛికాలు కావని.. వాటి వెనుక ‘అంతుచిక్కని విదేశీ వ్యక్తి’ ప్రమేయం ఉందంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బాంబు పేల్చారు.

సోనియా గాంధీ ఆత్మకథ “బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్” దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన తరుణంలో కంగన ఈ ఆరోపణలు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాణం కోసం నెహ్రూ-గాంధీ కుటుంబ చరిత్రపై లోతైన పరిశోధన చేసినప్పుడు ఎన్నో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. “గాంధీ కుటుంబంలోకి ఒక విదేశీ వ్యక్తి అడుగుపెట్టిన తర్వాతే ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, చివరకు రాజీవ్ గాంధీ వంటి అసలైన వారసులంతా ఒక్కొక్కరిగా బలయ్యారు. చివరికి ఆ కుటుంబానికి, అధికారానికి ఏకైక వారసురాలిగా మిగిలింది మాత్రం ఆ విదేశీ మహిళే. ఇన్ని వరుస సంఘటనలు జరిగినా ప్రజలు వీటిని కేవలం కాకతాళీయంగానే ఎలా భావించారో అర్థం కావడం లేదు” అని కంగన అనుమాన వ్యక్తం చేశారు.

సంజయ్ గాంధీ హఠాన్మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను కూడా కంగన ప్రస్తావించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేనకా గాంధీ చిన్న వయసులోనే వితంతువుగా మారితే, ఆమెను పసిబిడ్డతో సహా ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. వరుస మరణాల పరంపర ప్రారంభం కావడానికి ముందే మేనకను ఇంటి నుంచి సులభంగా పక్కకు తప్పించడం ఎంతటి వ్యూహాత్మకంగా జరిగిందో ఆలోచించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాంధీ కుటుంబానికి చెందిన ఓ పాత వీడియోను ప్రస్తావిస్తూ.. అందులో కుటుంబమంతా సోనియా చెప్పుచేతల్లో ఉన్నట్లు కనిపించిందని, భర్తను కోల్పోయిన మేనకా గాంధీ మాత్రం తీవ్ర వివక్షకు గురై ఒక మూలన ఒంటరిగా ఉండిపోయారని కంగన విశ్లేషించారు. విదేశాల్లోని ఓ కేఫ్‌లో రాజీవ్‌తో పరిచయమై కుటుంబంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. అనంతర కాలంలో భారతదేశాన్ని దశాబ్దాల పాటు శాసించే స్థాయికి ఎదగడంపై కంగన తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేశారు.

గతంలోనూ గాంధీ కుటుంబంపై పలుమార్లు నిప్పులు చెరిగిన కంగనా రనౌత్.. ఇప్పుడు నేరుగా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుల మరణాలనే ముడిపెడుతూ ఈ స్థాయి ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి తెరతీసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events