అంతరిక్ష రంగంలో జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. ప్రపంచంలో మొదటిసారిగా కలపతో చేసిన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. క్యోటో విశ్వవిద్యాలయం, సుమిటోమో ఫారెస్ట్రీ అనే పరిశ్రమ కలిసి లిగ్నోశాట్ అనే ఈ పర్యావరణ అనుకూల ఉపగ్రహాన్ని తయారుచేశాయి. దీనిని అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బయల్దేరిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. త్వరలోనే దీనిని భూమికి 400 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చిన్న ఉపగ్రహాన్ని మగ్నోలియా అనే రకమైన కలపతో 10 సెంటిమీటర్ల సైజులో ఘనాకారంలో తయారుచేశారు. తీవ్రమైన వేడి వాతావరణాన్ని, అంతరిక్ష రేడియేషన్‌ను తట్టుకునేలా దీనిని రూపొందించారు.
సాధారణంగా ఇతర లోహాలతో తయారుచేసే ఉపగ్రహాలు మళ్లీ భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పగిలిపోవడమో, కాలిపోవడమో జరుగుతుంది. ఇవి అల్యూమినియం ఆక్సైడ్ వంటి హానికర కణాలను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చెక్కతో తయారుచేసిన ఈ ఉపగ్రహం భూమి వాతావరణంలోకి ప్రవేశించి నప్పుడు పూర్తిగా కాలిపోతుందని, దీని నుంచి ఎలాంటి హానికర పదార్థాలు వెలువడవని శాస్త్రవేత్తలు తెలిపారు. మొదటిసారి చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం అనుకున్న రీతిలో పని చేస్తే భవిష్యత్తులో లోహాలతో చేసే ఉపగ్రహాలను నిషేధించవచ్చని శాస్త్రవేత్త తకావో డోయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.