అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికన్ కాంగ్రెస్‌లో సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌కు ఘన విజయం దక్కినట్లయింది. తన కలల బిల్లుకు ఆమోదం లభించడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు ఒక కొత్త స్వర్ణయుగం ప్రారంభమైందంటూ వ్యాఖ్యానించారు.

దేశ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో అమెరికాకు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కంటే మెరుగైన పుట్టినరోజు బహుమతి మరొకటి ఉండదు అంటూ వ్యా్ఖ్యానించారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించారు. మన పార్టీ ఎన్నడూ లేనంత ఐక్యంగా ఉంది. ఈ బిల్లుతో అమెరికా ప్రజలు మరింత ధనవంతులుగా, సురక్షితంగా, గర్వంగా జీవిస్తారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వియానికి గుర్తుగా ఈ బిల్లుపై వైట్‌హౌస్‌లో సంతకాల సేకరణ ఉంటుందని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల శాసనసభ్యులు, సెనేటర్లను ట్రంప్ ఆహ్వానించారు.















