ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటించిన చిత్రం ఇడుపు కాయితం.ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ ఈ సినిమాలోని మాటలు మన ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లుగానే ఉంటాయని, ఎక్కడ నాటకీయత ఉండదని, ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేసే కథాంశమిదని పేర్కొన్నారు.

దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ మాట్లాడుతూ నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లితంతు గురించి మంచి అవగాహన ఉంది. ఈ సినిమాలో చూస్తుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యే అందమైన కుటుంబ కథ ఇది అన్నారు. మనందరి ఇళ్లలో జరిగే కథ ఇదని, ప్రతి సన్నివేశం, మాట సహజంగా ఉంటుందని హీరో ప్రియదర్శి అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఇడుపుకాయితం అనేది ఓ జంట విడిపోవడానికి రాసుకునే పత్రం అనుకుంటాం. కానీ అదే జంట విడిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించడానికి ఒక సర్టిఫికెట్‌లాగ ఇడుపుకాయితాన్ని భావించాలన్నది నా ఉద్దేశ్యం అన్నారు. ఇడుపు కాయితం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణ సంస్థలు: సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్, రచన-దర్శకత్వం: వంశీరెడ్డి దొండపాటి.















