అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మకు అరుదైన గౌరవం లభించింది. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ విభాగానికి వర్మను డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్(సీఈవో)గా నియమిస్తూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. జరిగిన ఓటింగ్‌లో 67-26 ఓట్ల తేడాతో 54 ఏళ్ల వర్మ ఈ పోస్టుకు ఎన్నికయ్యారు. 2015, జనవరి 16 నుంచి 2017, జనవరి 20 వరకు ఆయన భారత్‌కు అమెరికా దౌత్యవేత్తగా ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్ ప్రపంచ పబ్లిక్ పాలసీ హెడ్‌గా, ముఖ్య న్యాయాధికారిగా ఉన్నారు. అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ కుటుంబంలో 1968లో జన్మించిన రిచర్డ్ వర్మ పెన్సిల్వేనియాలో పెరిగారు. జార్జిటౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో న్యాయవాద విద్యలో పీజీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తన సేవలకుగానూ విదేశాంగ శాఖ, విదేశీ వ్యవహరాల మండలి, వైమానిక దళం నుంచి పురస్కారాలు అందుకున్నారు.

