ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. తాజాగా ఆమెకు కళా, సాంస్కృతిక రంగాల్లో ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘బావోలీ ఆర్ట్ సంఘం’ (Baoli Art Sangam) కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. భారతదేశంలోనే మొట్టమొదటి ‘స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే’గా చరిత్ర సృష్టించబోతున్న ఈ భారీ సాంస్కృతిక ఉద్యమానికి ఆమె నేతృత్వం వహించబోతున్నారు.

మన దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసరాల్లో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన మెట్ల బావులు ఉన్నాయి. ఒకప్పుడు నీటి వనరులుగా, సామాజిక కేంద్రాలకు నిలయాలుగా వెలుగొందిన ఈ అద్భుత కట్టడాలు కాలక్రమేణా ఆదరణ కోల్పోయాయి. వీటి చారిత్రక, పర్యావరణ విశిష్టతను నేటి యువతరానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్, ‘ఏక్ చిత్ర’కు చెందిన అన్నపూర్ణ మాదిపాడిగ సంయుక్తంగా ఈ వినూత్న ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ పురాతన మెట్ల బావులకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా, వాటిని అద్భుతమైన కళా వేదికలుగా తీర్చిదిద్ది ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్నేహారెడ్డిని ఈ ప్రాజెక్ట్ కు ఎంపిక చేశారు.

ఈ మహా యజ్ఞంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు, దాదాపు 40 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బావోలీ ఆర్ట్ ఫెస్టివల్’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేట్, గోల్కొండ, రాష్ట్రపతి నిలయం, ఫలక్‌నుమా వంటి 13కు పైగా చారిత్రక ప్రాంతాల్లో ఉన్న మెట్ల బావుల వద్ద 200 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కళా ప్రదర్శనలతో పాటు వారసత్వ సంపద పరిరక్షణపై లోతైన చర్చా గోష్ఠులు కూడా నిర్వహిస్తారు.

ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలపై అల్లు స్నేహారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బావోలీ ఆర్ట్ సంఘంలో కొత్త బాధ్యత చేపట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆమె తెలిపారు. హైదరాబాద్ ఘనమైన చరిత్ర, వారసత్వ సంపదపై ముఖ్యంగా నేటి యువతరంలో మరింత అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని స్నేహారెడ్డి అభిప్రాయపడ్డారు. భావితరాల కోసం మన సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడే దిశగా వేస్తున్న ఒక అర్థవంతమైన అడుగు ఇదని ఆమె పేర్కొన్నారు.















