అమెరికాకు వలసల పోటు తప్పదు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారంతా అమెరికా ప్రయాణానికి క్యూ కడుతూ ఉంటారు. దీంతో భిన్న దేశాలకు చెందిన వారితో, విభిన్న జాతుల సమాహారంగా అమెరికా మారింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి వేళ న్యూయార్క్ నగరం లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల పోలింగ్ వేళ, బ్యాలెట్ పేపర్లలో భారతీయ భాషకు చోటు దక్కింది. అది కూడా భారతీయులు అత్యధికంగా మాట్లాడుకునే హిందీ భాషకు చోటు కల్పించ లేదు. బెంగాలీ భాషకు చోటు కల్పించడం గమనార్హం.
బ్యాలెట్ పత్రంలో ఇంగ్లీష్‌తోపాటు మరో నాలుగు భాషలకు మాత్రమే స్థానం కల్పించారు. అందులో బెంగాలి ఒకటి. మిగిలిన మూడు భాషలు చైనీస్, స్పానిష్, కొరియన్‌లు ఉన్నాయి. ఇంగ్లీషుతో పాటు ఈ నాలుగు భాషల కు చోటు కల్పించాలని భావించామని న్యూయార్క్ సిటీ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ జే రేయాన్ స్పష్టం చేశారు.