శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సింగిల్. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. ఆద్యంతం వినోదాత్మకంగా ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్‌రాజు సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని, వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మెప్పిస్తాయని చెప్పారు. కోవిడ్ సమయంలో శ్రీవిష్ణుకి ఈ కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. శ్రీవిష్ణు నటించిన సినిమాలన్నీ చూశా. ఆయన బాడీలాంగ్వేజ్, కామెడీ టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఆయన పండించే హాస్యం మరో స్థాయిలో ఉంటుంది. వెన్నెల కిషోర్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటూ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది అని కార్తీక్ చెప్పారు.

శ్రీవిష్ణు డబ్బింగ్ వల్ల ఈ సినిమాకు మరింత కామెడీ జత కలిసిందని, ఆయన సంభాషణా చాతుర్యం వల్ల స్క్రిప్ట్‌లో ఉన్న వినోదం మరింత ఎలివేట్ అయిందని అన్నారు. సంగీతం, నిర్మాణ విలువల గురించి మాట్లాడుతూ విశాల్‌చంద్రశేఖర్ కథానుగుణంగా మంచి పాటలిచ్చారు. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. శ్రీవిష్ణు కోసం మరో మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఆయనతో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా అని కార్తీక్‌రాజు పేర్కొన్నారు. ఈ నెల 9 ప్రేక్షకుల ముందుకురానుంది.
