సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు దుర్మరణం చెందారు. కువైత్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న దండు గౌస్ బాషా తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైత్ నుండి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని కారులో తిరిగి కువైత్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుండి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై ఒక ట్రాలను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు.
మృతుల పాస్ పోర్టులు, అఖమా (రెసిడెన్సీ వీసా)లు పూర్తిగా కాలిపోవడంతో వీరి గుర్తింపు ఒక దశలో పోలీసులకు కష్టంగా మారింది. పోలీసుల సహాయంతో సిద్దిఖ్ తువూరు అనే ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త వీరి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను సంప్రదించడంతో మృతుడు గౌస్ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది.