అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ దుర్మరణం చెందారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె కూతురు, పైలట్ గాయాలతో బయటపడినప్పటికీ, వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోమా గుప్తా(63), ఆమె తనయ రీవా గుప్తా (33)లు ఓ తేలికపాటి ప్రదర్శన విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో కాక్పిట్ నుంచి పొగ రావడంతో పైలెట్ దానిని లాంగ్ ఐల్యాండ్ వద్ద క్రాష్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానంలో మంటలు చెలరేగి రోమా అక్కడిక్కడే మృతి చెందగా, కాలిన గాయాలతో రీవా, పైలెట్(23)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన విమానాన్ని డెన్నీ వైజ్‌మన్ ఫ్లైట్ స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై డెనీ వైజ్‌మస్ స్కూల్ స్పందించింది. విమానం ఇటీవలే రెండు పూర్తిస్థాయి తనిఖీలు పూర్తి చేసుకుందని పేర్కొంది. పైలట్‌కు కూడా శిక్షణ ఇవ్వడంలో మంచి అనుభవం ఉందని చెప్పింది. రోమా రేవాల కోసం సంస్థ డెమాన్‌స్ట్రేషన్ ఫ్లైట్ నిర్వహించిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విమాన నడపడం నేర్చుకోవాలనుకునే వారి కోసం ఇలాంటి విమాన ప్రయాణాలు నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. అయితే, ప్రమాదంలో పడిన విమానం పర్యటనల కోసం ఉద్దేశించినదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.