అమెరికా-కెనడా బార్డర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారు రొమానియా, భారత్ కు చెందిన రెండు కుటుంబాలుగా గుర్తించినట్లు చెప్పారు.అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్ పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో ఈ ఘటన జరిగింది. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా, జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కెనడా-అమెరికా సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.

