అమెరికా అధ్యక్ష పదవికి తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో అమెరికన్ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలిభర్త ఎక్కడ? అంటూ ఎగతాళి చేశారు. దీనిపై స్పందించిన హేలి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండే అర్హత లేదని దీటుగా బదులిచ్చారు.ట్రంప్ నువ్వేమన్నా చెప్పాలనుకుంటే నా వెనుక చెప్పొద్దు. ఇద్దరం చర్చ పెట్టుకుందాం. నీవు చెప్పాల్సిందేమన్నా ఉంటే అక్కడే నా ముఖం మీద చెప్పు అని అన్నారు. 75 ఏండ్లు దాటిన రాజకీయవేత్తల మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. కాగా, హేలి భర్త మేజర్ మైఖేల్ హేలి దక్షిణ కరోలినా నేషనల్ గార్డులో కమిషన్డ్ అధికారిగా ఉన్నారు. గత ఏడాది జూన్ నుంచి ఆయన అక్కడే ఉన్నారు.