అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో మహిళ ఘన విజయం అందుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ నగర పాలక మండలి సభ్యురాలుగా భారత సంతతికి చెందిన జననీ రామచంద్రన్ ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబంలో జననీ రామచంద్రన్ జన్మించారు. స్టాన్‌ఫర్డ్, కాలిఫోర్నియా, బర్కిలీ యూనివర్శిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. జనని వృత్తిరీత్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. ఈమె ఎల్జీబీటీక్యూ వర్గానికి చెందినవారు. 30 ఏండ్ల వయసున్న జననీ రామచంద్రన్ నవంబర్ 8 జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓక్లాండ్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైంది. తన ప్రత్యర్థి నెన్నా జాయినర్ను 18,874 ఓట్ల తేడాతో ఓడించింది. ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలు ఈమెనే కావడం విశేషం. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో ప్రమాణం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు జననీ రామచంద్రన్. గృహ హింసకు వ్యతిరేకంగా ఉద్యమించే జననీ రామచంద్రన్.. ఓక్లాండ్ నగరంలోని ఐదు కమ్యూనిటీ హెల్త్ క్లీనిక్‌లలో న్యాయ సేవలను కూడా అందించారు. 16 ఏండ్ల వయసులో తన లోకల్ కమ్యూనిటీలో వనరులు లేని పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసేందుకు లాభాపేక్ష లేని సంస్థను జననీ ప్రారంభించారు.