జీ20 సమ్మిట్ కు ముందు అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కు కరోనా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడు జో బైడెన్ కి మాత్రం నెగటివ్ వచ్చింది. భార్యకు పాజిటివ్ రావడంతో అధ్యక్షుడు ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. జిల్ బైడెన్‌కు పాజిటివ్ తేలడంతో అధ్యక్షుడికి సోమవారం, మంగళవారం వరుసగా కొవిడ్ టెస్ట్ నిర్వహించగా, రెండు సార్లూ నెగటివ్ వచ్చినట్లు వెల్లడించింది. దీంతో బైడెన్ గురువారం ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలిపింది. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు అధ్యక్షుడు బైడెన్ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు అని యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు.
