మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠా యోధురాలైన రాణి అహల్యా బాయి హోల్కర్ జీవితం వెండితెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నేడు ఆమె 300వ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ విషయాన్ని ప్రకటించారు. అహల్యా బాయి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని, అందుకే ఆమె కథను సినిమా రూపంలో ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఈ చిత్రం మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. అంతేకాకుండా, దూరదర్శన్ మరియు ఇతర ఓటీటీ వేదికల్లోనూ ఈ బయోపిక్‌ను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణంపై చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
