
మానవుడు వేగంగా పని చేయడానికి సహాయపడే సాధనంగా కృత్రిమ మేధ (ఏఐ) ఇక ఎంతమాత్రం ఉండబోదు. క్రమంగా దానంతట అదే పని చేసే స్థితికి వస్తున్నది. దీని పూర్తి ప్రభావాన్ని ఎదుర్కొనబోయే మొదటి కెరీర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమొడెయి మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఏఐ ఏం చేయగలదు? అనే అంశంపై ప్రపంచం తీరిక లేకుండా చర్చిస్తున్నదన్నారు. ఏఐ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని మూరేస్ లాతో పోల్చారు. ప్రతి కొన్ని నెలలకు దాదాపు యాంత్రికంగా, నిలకడగా ఏఐ మోడల్స్ మరింత సమర్థతను సొంతం చేసుకుంటున్నాయన్నారు. ఈ ప్రగతి ఎంత వేగంగా వాస్తవ ప్రపంచ మార్పులుగా మారుతాయనే దానిపై నిజమైన విధ్వంసం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆంత్రోపిక్‌లో కొందరు ఇంజినీరింగ్ లీడ్స్ ఇకపై కోడ్‌ను తమంతట తాము రాయరని, తమ కంపెనీ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ మోడల్ క్లౌడ్‌పై ఆధారపడతారని చెప్పారు. ఏఐ సిస్టమ్స్ అత్యంత సంక్లిష్టమైన పనులను చేపడతాయని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో మనుషులతో కూడిన బృందాల అవసరం ఉండదని తెలిపారు.















