Skip to main content

Namaste NRI

పరిషత్ పోరులో కూటమి విజయం

పరిషత్‌ పోరులో కూటమి హవా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మెజార్టీ స్థానాల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫలితాలు కూటమి ప్రభుత్వ పాలనకు గీటురాయిగా నిలిచాయి.

రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఈనెల 5న ఎన్నికలు జరుగగా, ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించిన స్థానాల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిచారు. వైసీపీ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపýదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉనికి చాటుకున్నది.వైసీపీకి కంచుకోటగా భావించే పులివెందుల టీడీపీ వశమైంది.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 1451 ఎంపీటీసీలను గెల్చుకోగా, ఇతరులు 240 ఎంపీటీసీలు గెల్చుకున్నారు. మిగిలిన ఎంపీటీసీలన్నీ కూటమి వశమయ్యాయి. ఏకగ్రీవాలు పోను 582 జెడ్పీటీసీలకు ఎన్నిక నిర్వహించగా, రాత్రి 9 గంటల సమయానికి వైసీపీ 35 స్థానాలు గెల్చుకుని, మరో 12 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది. ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాలన్నింటిలో కూటమి అభ్యర్థులు జయ కేతనం ఎగురవేశారు.


పల్నాడులో పరిషత్ పోరులో అత్యధిక మెజార్టీలతో విజయం సాధించిన అభ్యర్థులలో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మీసరోజ ఒకరు. 32,919 ఓట్ల మెజార్టీతో సీపీఎం అభ్యర్థిపై రికార్డు విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఇదే అత్యధిక మెజార్టీ. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు జనసేన జడ్పీటీసీ అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు 30,273 ఓట్ల మెజార్టీతో సత్తాచాటారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో కూటమి బలపరి చిన జనసేన జడ్పీటీసీ అభ్యర్థి శింగంశెట్టి వెంకట బాల ప్రసాద్ 28,863 మెజారిటీతో గెలుపొందారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కత్తి సరోజిని 22,882 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దొండేటి వెంకాయమ్మపై విజయం సాధించారు.ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల మెజార్టీతో, కడప జిల్లా వేంపల్లిలో వైసీపీ అభ్యర్థి బత్తల వెంకట శివమ్మ 19,203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

విజయనగరం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించే శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఆయన కుమార్తె అనూష బొండపల్లి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.బొండపల్లి నుంచి కుమార్తె అనుష, గరివిడి నుంచి కోడలు పూజిత, గుర్ల మండలం నుంచి సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి పోటీ చేశారు. గరివిడి జెడ్పీటీసీగా పూజిత విజయం సాధించారు. స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తుమ్మ కల్పన, గొడుగుల బంగార్రాజు విజయం సాధించారు. నక్కపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోనే హోంమంత్రి అనిత నివాసం ఉంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (28) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందగా, శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపొందిన ఆనందం పంచుకోకుండానే ఆమె కన్నుమయడం ఓటర్లను విషాదంలో ముంచెత్తింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events