పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌లో అతనికి చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. వెంటనే అక్కడి నుండి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు.

శ్రీతేజ్‌ని మాములు మనిషిగా మార్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీతేజ్ తమను ఇంకా గుర్తు పట్టడం లేదని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. తాజాగా శ్రీతేజ్‌ను అల్లు అరవింద్, బన్నీ వాస్ పరామర్శించారు. అతని ఆరోగ్యం కుదుటపడి మామూలుగా మారే వరకూ అండగా ఉంటామని, భవిష్యత్తులోనూ శ్రీతేజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతని కుటుంబానికి అండగా నిలుస్తామంటూ వారు భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకొని అందరి పిల్లల మాదిరిగా స్కూల్‌కి వెళ్లాలని ఆకాంక్షించారు అల్లు అరవింద్. కాగా, శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అతని ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలు అన్నింటిని భరిస్తున్నారు బన్నీ.
