ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం పుష్పక విమానం. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆనంద్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించాడు. ట్రైలర్లో అతను ఆకట్టుకునేలా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ కథలో హీరో క్యారెక్టర్‌కు చాలా కష్టాలుంటాయి. అతని కష్టాలు మనల్ని నవ్విస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ పిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్‌గా నటించారు అని తెలిపారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ పుష్పక విమానం సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘనా, నిర్మాత విజయ్ మట్టపల్లి, దర్శకుడు దామోదర, నటుడు అభిజీత్, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, గీత రచయిత ఫణికుమార్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు.