ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు రామలింగయ్యపై రాసిన ప్రత్యేక పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉన్నతమైన హాస్యాన్ని అందించిన దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య అని ప్రశంసించారు. చిరంజీవి మాట్లాడుతూ అల్లు రామలింగయ్యతో ఆయన కుటుంబ సభ్యులు అందరి కంటే దగ్గరగా ఉండే అవకాశం తనకు దక్కిందని అన్నారు. అల్లు గొప్ప నటుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబ సభ్యుఇగా, ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన సహ నటుడిగా అల్లు రామలింగయ్య సాన్నిహిత్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అల్లు రామలింగయ్య గారు ఆయనొక నిరంతర విద్యార్థి, చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మధ్యే ఉన్నారని కొనియడారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ సతీమణి సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.














