భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నదని, సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో అద్భుత ఫలితాలు సాధించామనడానికి భారత్ నిదర్శనం అని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ అభిప్రాయ పడ్డారు. భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. హెల్త్, ఎన్విరాన్మెంటల్ మార్పులు తదితర అంశాలపై మోదీ, బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ పలు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటే, భారత్ వంటి సృజనాత్మక, శక్తిమంతమైన దేశాన్ని సందర్శించడం స్ఫూర్తి కలిగిస్తున్నదని తన బ్లాగ్ గేట్స్ నోట్స్ లో బిల్ గేట్స్ రాసుకున్నారు. కరోనా వేళ లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు తక్కువ ధరకే ఎంతో సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసిందని గుర్తు చేశారు.భారత్లో ఉత్పత్తి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేసి స్నేహ బంధం ప్రదర్శించిందని బిల్గేట్స్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీతర్వాత.. హెల్త్, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్ పురోగతిపై మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నానని పేర్కొన్నారు.