అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న వారిని నిర్ధాక్షిణ్యంగా స్వదేశాలకు పంపిస్తున్నారు. అక్రమంగా అమెరికాకు వచ్చిన ఆఫ్రికా పౌరులు చాలామందిని ఇటీవల తమ దేశాలకు తిరిగి పంపారు. అయితే వారిని స్వీకరించడానికి ఆయా ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి.దాంతో ట్రంప్ కన్నెర్ర చేశారు. అక్రమ వలసదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. యూఎస్‌కు వెళ్లిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేస్తోంది. ఇమిగ్రేషన్ చట్టాల అమలును వేగవంతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు.

డిపోర్టేషన్ విషయంలో తన ప్రవర్తన మార్చుకొని, సమస్యను పరిష్కరించే వరకు దక్షిణ సూడాన్‌కు చెందిన వారి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశామని, కొత్త వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నామని మార్కో రూబియో ప్రకటించారు. దాంతో అక్కడి పౌరులు ఎవరూ వీసాపై అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదన్నారు. దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్‌దారులకు అమెరికాలో ఉన్న ఏ వీసాలకు విలువలేదని చెప్పారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని రూబియో చెప్పారు. దక్షిణ సూడాన్ ట్రంప్ పరిపాలనా విధానానికి సహకరించినప్పుడు మాత్రమే ఈ కఠిన నియమాలను సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
