ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. మస్క్ ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని తెలిపారు. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఎలాన్ మస్క్ ఈ ఏడాది జనవరిలో ప్రస్తావించారు. ఈ మేరకు ఐరాస విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.