లంచం, నేరారోపణల కేసులో అమెరికా దూకుడును ప్రదర్శిస్తున్నది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తోపాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) సమన్లు పంపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు సాగర్ అదానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, దేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికార వర్గాలకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు ఇచ్చారని ఎస్‌ఈసీ ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ వ్యవహారంలో అమెరికా న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ దర్యాప్తులూ జరుగుతుండగా, అదానీసహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
ఇప్పటికే గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యం లో ఆరోపణలపై వివరణ కోరుతూ ఎస్‌ఈసీ ఈ సమన్లు జారీ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల అదానీల నివాసాలకు వీటిని పంపింది. ఈ సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా జారీ అయిన నోటీసుల్లో పేర్కొన్నది. స్పందించకపోతే కోర్టు ధిక్కారం గా పరిగణించాల్సి ఉంటుందని, తదుపరి చర్యలకు బాధ్యులు అవుతారని కూడా ఎస్‌ఈసీ హెచ్చరించింది.