ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేలా భారత్ చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌ను కోరింది.
ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ -రష్యా మధ్య బలమైన బంధం ఉందని, ఇది అందరికీ తెలుసన్నారు. ఈ దీర్ఘకాల బంధాన్ని ఉపయో గించుకోవాలని భారత్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. రష్యాతో పటిష్ఠ బంధం, విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌ను కోరారు. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని పుతిన్‌కు చెప్పమని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనను గౌరవించ మని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాల్సిందిగా మిల్లర్ పేర్కొన్నారు.