దాదాపు 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపైకి అమెరికా చేపట్టిన మూన్ మిషన్ విఫలమైనట్టు కనిపిస్తున్నది. ప్రయోగం జరిపిన 24 గంటల్లోనే పెరిగ్రిన్ స్పేస్‌క్రాఫ్ట్ లో ఇంధన లీకేజ్ సమస్య తలెత్తినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇంధన ట్యాంక్‌లో తీవ్ర సమస్య తలెత్తిందని, రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండర్‌ను తయారుచేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ ప్రకటించింది. చంద్రుడిపై పెరిగ్రిన్ సాఫ్ట్‌ల్యాండ్ జరిపే అవకాశం లేదని, స్పేస్‌క్రాఫ్ట్‌పై గ్రౌండ్‌స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మిషన్‌కు సంబంధించి మరికొద్ది గంట ల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.
చంద్రునిపై నీటి తీరుతెన్నులను పరిశోధించే పెరిగ్రిన్ అయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్, ఎవరెస్ట్ పర్వతం నుంచి సేకరించిన రాతి తునక, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు, వికీపీడియా ప్రతి, ఒక బిట్ కాయిన్, కొన్ని ఫోటోలు, డ్రాయింగ్, ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనెడీ, జార్జ్ వాషింగ్టన్, ఐసెనహోవర్, స్టార్‌ట్రెక్ టీవీ ధారావాహిక సృష్టికర్త జీన్ రాడన్‌బెర్రీ, ప్రముఖ సైన్స్ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్ సి క్లార్క్‌కు సంబంధించిన అవశేషాలు, డీఎన్‌ఏ నూ ఈ వ్యోమనౌక మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ అభివృద్ధి కోసం ఆస్ట్రోబోటిక్ సంస్థతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 108 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.