కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం భేటీ అయ్యింది. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్, ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రధానంగా చర్చించారు. అయితే ఈ భేటీ తర్వాత ఈటల రాజేందర్‌తో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌షాతో భేటీ కావడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు వివరించానని, ఉప ఎన్నికకు మునుపు జరిగే బహిరంగ సభకు అమిత్‌షా హాజరుకానున్నారని ఈటల వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తూనే ఉండాలని, కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం సిద్ధించుకుంటామని షా పేర్కొన్నట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారానికి రావడానికి అమిత్‌షా అంగీకరించారని అన్నారు.