విక్కీకౌశల్ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం ఛావా. రష్మిక మందన్న కథానాయిక. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్కు విచ్చేసింది.ఈ సందర్భంగా విక్కీకౌశల్ మాట్లాడుతూ ఛావా సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాను. యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అన్నింటికంటే పెద్ద సవాలుగా అనిపించింది అన్నారు.
ఈ సినిమా ద్వారా నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్ర పోషించే అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. ఇది నా అదృష్టం. రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ఈ కథలో మాటలకందని భావం, దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటాయి. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా చూసిన ప్రతీసారి కన్నీళ్లొచ్చేవి. విక్కీకౌశల్ గొప్ప నటుడు. ఆయన పక్కన ఉంటే ఓ మ్యాజిక్లా అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది అని చెప్పింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.