బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆండీ బర్న్‌హామ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత దశాబ్ద కాలంలో బ్రిటన్ ఏడవ ప్రధానిగా ఆయన నిలిచారు. ప్రధాని కార్యాలయం వెలుపల వీడ్కోలు ప్రసంగం అనంతరం కీర్ స్టార్మర్ లాంచనంగా రాజీనామా చేసి కింగ్ చార్లెస్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ప్రజాసేవలంతో సహా ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే అంశాలకు తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని 56 ఏండ్ల బర్న్‌హామ్ తెలిపారు. బ్రిటన్ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో భారీ సంస్కరణలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మందగించిన ఆర్థిక వృద్ధి, ఒత్తిడిలో ఉన్న ప్రజాసేవలు, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలను బ్రిటన్ ఎదుర్కొంటున్న వేళ కొత్త ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.





























