అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సివేయ్ జాయో జింగ్-2 03, జాయోజింగ్-2 04 అనే రెండు సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిలోకి పంపించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్(సీఏఎస్‌సీ) అనుబంధ సంస్థ అయిన షాంఘై అకాడమీ ఆఫ్ స్పైస్‌ఫ్లైట్ టెక్నాలజీ(ఎస్‌ఏఎస్‌టీ) ఈ ఉపగ్రహాలను అభివృద్ధి చేసింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం లాంగ్ మార్క్-2సీ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించారు.
భూమి నుంచి ఎలాంటి జోక్యం లేకుండా వాటికవే మార్గాన్ని నిర్దేశించుకొని ప్రయాణించేలా, మార్గాన్ని మార్చు కునేలా వీటిని తయారుచేశారు. ఈ ఉపగ్రహాలు సర్వే, మ్యాపింగ్ కోసం పని చేయనున్నాయి. నిర్దేశించిన పని పూర్తి చేసిన తర్వాత అత్యంత కచ్చితత్వంతో వాటికవే తిరిగి వాటి కక్ష్యలోకి వస్తాయి. సాధారణ ఆప్టికల్ ఉపగ్రహాలు ఇన్‌ఫ్రారెడ్ లైట్‌పై ఆధారపడి పని చేస్తాయి. ఈ ఉపగ్రహాలు మాత్రం మైక్రోవేవ్ సిగ్నళ్ల ద్వారా పని చేస్తాయి. దీంతో ఇవి మేఘాలు, పొగమంచు ఉన్నప్పుడూ సర్వే, మ్యాపింగ్ కోసం పని చేయగలవు. రాత్రిపగలు, వాతావరణంతో సంబంధం లేకుండా హై రిజల్యూషన్ ఫొటోలను తీయగలవు. ఉపగ్రహాల ద్వారా సర్వే, మ్యాపింగ్ చేసే సాంకేతికతలో ఇది విప్లవాత్మకంగా మారొచ్చని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.