విదేశీ ఉద్యోగులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఉపాధి ముగిసిన తర్వాత హెచ్1బీ, ఎల్1 వీసాదారులు వంటి నిర్దిష్ట వలసేతర ఉద్యోగులకు(నాన్ ఇమిగ్రెంట్) ప్రస్తుతం లభిస్తున్న 60 రోజులు అదనపు గడువును రద్దు చేసేందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) విడుదల చేసింది. అంటే ఇకపై ఉద్యోగం కోల్పోతే దేశం వీడాల్సిందే. ఈ ప్రతిపాదన ఉపాధి ఆధారిత నాన్-ఇమిగ్రెంట్ వీసా విభాగాలకు సంబంధించిన అనేక అంశాలను స్పృశిస్తున్నప్పటికీ భారతీయ ప్రవాస సమాజం దృష్ట్యా చూస్తే దీని ప్రభావం ప్రధానంగా హెచ్1బీ, ఎల్1, ఓ1 వీసాదారులపై (అసాధారణ ప్రతిభకు గుర్తింపు పొందిన వారు) ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన అర్హత గల హెచ్1బీ ఉద్యోగులు వరుసగా 60 రోజుల వరకు లేదా వారి అధీకృత నివాసం ముగిసే వరకు, ఏది ముందుగా వస్తే దాని వరకు విచక్షణాపరమైన గడువును పొందవచ్చు. ఈ కాలంలో వారు మరొక స్పాన్సరింగ్ యజమాని కోసం వెతుకవచ్చు. హోదా మార్పు కోరవచ్చు. లేదా అమెరికాను విడిచి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ 60 రోజుల గడువును తొలగించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నది. ఇది భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.















