ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కరోనా మహమ్మారిని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోని 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోమ్ నుంచి 285 మంది ప్రయాణికులతో చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరింది. నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో ఆ ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేశారు. దీంతో 173 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అమృత్‌సర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు.
కరోనా పరీక్షలు ఇంకా కొనసాగుతున్నందున పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్నదని అన్నారు. కరోనా సోకిన వారిని నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలిస్తామని తెలిపారు. నిన్న కూడా ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో అమృత్‌సర్ వచ్చిన చార్టర్డ్ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటలీని రిస్క్ దేశాల జాబితాలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేర్చింది. నిబంధనల ప్రకారం అధికారులు కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.