డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలను మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా పాత చేదు జ్ఞాపకాలు వెంటాడాయి. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్ నుంచి భారీ ఎత్తున సీఎన్జీ గ్యాస్ లీకై బ్లోఅవుట్ సంభవించింది. 2014లో ఇదే నగరం గ్రామంలో జరిగిన గెయిల్ పైప్‌లైన్ పేలుడు విషాదం ఇంకా మరువకముందే, మళ్లీ అదే ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించడంతో జనం ప్రాణభయంతో వణికిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు, గ్యాస్ బావి వద్ద చిన్న నిప్పురవ్వ పడినా పెను విస్ఫోటనం జరిగే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మంటలు వ్యాపించకుండా నిరోధించేందుకు బ్లోఅవుట్ చుట్టూ ప్రత్యేకంగా వాటర్ అంబ్రెల్లాను ఏర్పాటు చేసి నీటిని వెదజల్లుతున్నారు.

ఈ అత్యవసర పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్ నగరం గ్రామానికి బయలుదేరింది. భద్రతా కారణాల దృష్ట్యా 216 జాతీయ రహదారి బైపాస్‌పై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి లీకేజీని శాశ్వతంగా అరికట్టే వరకు కోనసీమ వాసులు ఊపిరి బిగబట్టి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.















