తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగనున్న దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ఐటీ హబ్ సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించింది. భూ సమీకరణ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌లో ఈ ప్రాజెక్టు రానుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుర్తించింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను ఈ హబ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాను హెచ్‌ఎండీఏ రూపొందించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.