ప్రవాసీయుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని, అందుకే వారి సమస్యల పరిష్కరించాలనే క్తొత పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢల్లీిలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో 45 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, ఒక కోటి యాబై లక్షల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారని తెలిపారు. స్వదేశంలో, విదేశంలో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.
వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం నేషనల్ నెట్ వర్క్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్, నేషనల్ ఫెడరేషన్ ఫర్ మెగ్రంట్ వర్కర్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా నంగి దేవందర్ రెడ్డి బీజేపీకి, మంద భీంరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, ఓమాన్ రిటర్నీ డా.అస్మా ఖాన్ పాల్గొన్నారు. ప్రవాసీల కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో తాము చురుకుగా పాలు పంచుకుంటామని వారు తెలిపారు.