ఇటీవలే దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) టూరిజం కల్చరల్ డిపార్ట్‌మెంట్ అందించే ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసాను స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో గొప్ప పేరుప్రఖ్యాతులు గడించిన ప్రముఖులకు అబుదాబీ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తుంటుంది. తాజాగా దీనిని అందుకున్న వారి జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, కల్చర్, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివసించే వీలు ఉంటుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది. ఈ వీసాలకు 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అవే రెన్యువల్ అవుతాయి. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.















