అనేక సంచలనాలు సృష్టించిన శంకరాభరణం చిత్రానికి మరో గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 లో శంకరాభరణం చిత్రం రీస్టోరుడ్ ఇండియన్ క్లాసిక్స్ విభాగంలో ఎంపికయ్యింది. నేషనల్ ఫిల్మ్స్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి, భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన కళాతపస్వికే. విశ్వనాథ్ రూపొందిన చిత్రం శంకరాభరణం చోటు చేసుకుంది. అలా డిజిటలైజ్ చేసి చిత్రాల్లో కొన్ని ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. అందులో తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్శనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు. జేవీ సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.
