పోచంపల్లి , విలేజ్ టూరిజంపై తెలంగాణ పల్లెకు మరోసారి అంతర్జాతీయ ఘనత దక్కింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్రికాలో పోచంపల్లి – విలేజ్ టూరిజం డాక్యుమెంటరీ గుర్తింపు పొందింది. ఆఫ్రికా అంతర్జాతీయ పర్యాటక చలన చిత్రోత్సవాల్లో సిల్వర్ అవార్డు దూలం సత్యనారాయణకు లభించింది. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో జరిగిన ఈ వేడుకలో దూలం సత్యనారాయణ తరపున తెలంగాణ ప్రతినిధి నాగరాజు గుర్రాల ఐటీఎఫ్ఎఫ్ఏ సహ వ్యవస్థాపక డైరెక్టర్ జేమ్స్ బైర్నే చేతుల మీదుగా రజత పురస్కారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ దూలం సత్యనారాయణకు లభించిన గుర్తింపు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఉదాహరణగా నిలిచిందన్నారు. తెలంగాణ, అంతర్జాతీయ చలనచిత్ర సమాజం మధ్య బలమైన సంబంధాలను బలోపేతం చేసిందన్నారు.తెలంగాణ తరపున అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ తమకు ఇస్తున్న మద్దతును గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, పర్యాటక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో పర్యాటక శాఖ సాధించిన పురోగతి సినిమా నిర్మాతలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలకంగా ఉందన్నారు. దూలం సత్యనారాయణకు ఎన్నారైలందరి తరపున అభినందనలు తెలిపారు.

