గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ప్రవాస మహిళలకు డెలవరీ ఫీజు పెంచే యోచనలో ఆ దేశ ఆరోగ్యశాఖ ఉంది. మెటర్నిటీ ఆస్పత్రుల్లో విదేశీ మహిళలకు ప్రస్తుతం ఉన్న డెలవరీ రుసుమును 50 నుంచి 75 శాతం వరకు పెంచాలని యోచిస్తుందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చలు జరిగాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం నాన్-కువైటీ మహిళలు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థలో తమ పేర్లు నమోదు చేసుకున్నారో వారికి ప్రసవ రుసుము కింద 100 కువైటీ దినార్లు (రూ. 26,545) వసూలు చేస్తున్నారు. ఇది నార్మల్ డెలివరీకి మాత్రమే. అదే సీజేరియన్ అయితే మాత్రం 150 దినార్లు (రూ. 39,817) ఉంటుంది. ఇక ఈ ఫీజులో డెలివరీ చార్జీలతో పాటు ఆల్ట్రాసౌండ్ పరీక్షలు, లేబొరేటరీ టెస్టులు, మెడిసిన్స్ ఉంటాయి. దీనికి ఆస్పత్రి స్టే చార్జీలు అదనం. అయితే, ఇకపై డెలివరీ చార్జీలు వేరు, మిగతా ఆరోగ్య పరీక్షలు, మెడిసిన్స్‌కు వేరుగా రుసుము వసూలు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అలాగే ఆస్పత్రిలో స్టే చేసేందుకు ఇచ్చే ప్రైవేట్ రూమ్ రుసుమును కూడా రెండింతలు చేయాలని యోచిస్తుంది.