పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు. ఛలో ఢిల్లీ పేరిట తమ నిరసనను నేడు తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా చేరుకొని రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ట్రాక్టర్ల సాయంతో బారికే డ్లను తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు మరోమారు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, రైతులపై హర్యానా పోలీసులు ఇప్పటికే ఓసారి టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోవైపు పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వాపోతున్నారు. తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.