Namaste NRI

టాలీవుడ్‌ లో మరో విషాదం… ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. సీనియర్‌ యాక్టర్‌ చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.చలపతిరావు.. 1944, మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు.

 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సహాయ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు. మహానటుడు ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండితెరపై ఒక వెలుగువెలిగారు.  నిర్మాతగాను ఆయన గుర్తింపు పొందారు. తన నిర్మాణ సారథ్యంలో కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి సినిమాలను తెరకెక్కించారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. ఆయన కుమారుడు రవిబాబు విలక్షణమైన నటుడిగా, దర్శకునిగా గుర్తింపు పొందారు. సినీ పరిశ్రమలో ఆయనను అంతా బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

సీనియర్ ఎన్టీఆర్ తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీమ్ అనార్కలి, భలే కృష్ణుడు, సరదా రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, అల్లరి రాముడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ ఇలా ఎన్నో వందల సినిమాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. చలపతి రావు చివరిసారిగా గతేడాది విడుదలైన బంగార్రాజు చిత్రంలో కనిపించారు. చలపతి రావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events