ఉత్తర కొరియా అధినేత పైత్యం రోజు రోజుకూ ముదిరిపోతోంది. విచిత్రమైన ఆంక్షలు, వింత నిర్ణయాలతో ప్రజలను బందీలుగా చేస్తూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారు. బయట ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయి అక్కడి ప్రజలు జైలు పక్షుల్లుగా బతుకుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు. పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను కూడా కార్మిక శిబిరాలకు తరలించి ఆరు నెలల పాటు వారితో చాకిరీ చేయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలని, అలా కాకుంటే వారు కిమ్ అనుసరించే సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదం ఉందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.