పోలండ్‌లో జరిగిన 17వ పోలండ్ కప్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తానా స్పాన్సర్ చేసిన క్రీడాకారిణి అనూష నేలకుడిటి 3 ఈవెంట్స్‌లలోనూ విజయం సాధించి మెడల్స్‌ను అందుకుంది. సింగిల్స్ పోటీల్లో బ్రాంజ్ మెడల్‌ను, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను, మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా బ్రాంజ్ మెడల్‌ను అందుకుని తన సత్తాను ప్రదర్శించింది. జూలై 5 నుంచి 7వ తేదీ వరకు ఈ పోటీలు పోలండ్‌లో జరిగాయి.
తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆమె ప్రతిభను గుర్తించి వివిధ టోర్నమెంట్‌లలో ఆమె పాల్గొనేందుకు వీలుగా తానా తరపున ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. ప్రతిభను ప్రోత్సహించ డంలో ముందుండే నాగ పంచుమర్తి చొరవతో తానా నాయకులు కూడా తమవంతుగా ఆమెకు సహకారాన్ని అందించారు. నేడు ఆమె వివిధ పోటీల్లో మెడల్స్‌ను గెలుచుకుని తానాకు మంచి పేరును తీసుకువచ్చింది. ఆమె గెలుపుపట్ల నాగ పంచుమర్తితోపాటు తానా నాయకులు పలువురు ఆమెకు అభినందనలు తెలియజేశారు.