ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకున్నారు. వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు మొంథా తుఫాను సహయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు ప్రభుత్వం డ్రోన్లను కూడా వినియోగిస్తోంది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతోన్న వ్యక్తిని అధికారులు డ్రోన్ ద్వారా గుర్తించారు. అధికారులు వెంటనే అలెర్ట్ కావడంతో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. అంతేకాదు వరదలో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల కొట్టుకుపోతున్న పశువులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఒడ్డుకు చేర్చారు. డ్రోన్ల ద్వారా ప్రమాదకర పరిస్థితులను గుర్తించి అధికారులు వెంటనే అలెర్ట్ అవుతున్నారు.
















