ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ( గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్) ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పలువురు హాజరయ్యారు. సదస్సు మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు, రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబందించి 248 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. రిలయన్స్, అదానీ, ఆదిత్య, బిర్లా, రెన్యూ వపర్, అరబిందో, డెకిన్, ఎన్టీపీసీ ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, శ్రీ సిమెంట్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్ని విస్తరించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి అన్నారు.