పి.మహేశ్ బాబు దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి దర్శకుడు పి.మహేశ్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… ఓ అమ్మాయికి పెళ్లంటే ఇష్టం ఉండదు. అమ్మ అవ్వడం మాత్రం ఇష్టం. దానికోసం ఓ అబ్బాయ్ హెల్ప్ తీసుకుంటుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే ప్రశ్నకు సమాధానమే మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి. ఇందులో అడల్డ్ కంటెంటేం ఉండదు. కథలో బోల్డ్‌నెస్ ఉంటుంది. అంతే, ట్రైలర్‌లోనే పాయింట్‌ని చెప్పి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాం. భార్యాభర్తలైనా, ప్రేమికులైనా వారిమధ్య రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ బాండింగ్ కామన్. మా కథలోని హీరోహీరోయిన్ల మధ్య అదే బాండింగ్ చూస్తారు అన్నారు దర్శకుడు మహేశ్‌బాబు.పి.
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్‌బాబు మాట్లాడుతూ కథ చెప్పిన మూడు నెలలకు నవీన్ ఓకే చెప్పాడు. ఈలోపు పాండమిక్ వచ్చేసింది. అందరం ఇంటికే పరిమితమైపోయాం. ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అదే. ఒక్కక్షణం కూడా ఇబ్బందిపడకుండా సినిమా చూశామని సెన్సార్ వాళ్లన్నారు. చాలా ఆనందం అనిపించింది. ఇది మన నేటివిటీ కథ. అందుకే దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. చిరంజీవిగారు సినిమా చూసి అభినందించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. విడుదలకు ముందే సినిమా విజయం సాధించిన ఆనందం కలిగింది’ అని మహేశ్‌బాబు చెప్పారు.