అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా పిటిషన్ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తి చేసుకున్నది. రాబోయే కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి ముసాయిదాను ప్రభుత్వం ప్రజల పరిశీలనకు ఉంచనున్నది. ముందుగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రచురించి, సాధారణ ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఈ పరిణామం భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికా ఇచ్చే హెచ్1బీ వీసాలు, ఉద్యోగ పొడిగింపుల్లో భారతీయులదే సింహభాగం. అధికారిక గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో పొడిగించిన మొత్తం హెచ్ 1బీ ఉద్యోగాల్లో దాదాపు 78 శాతం భారతీయులకే దక్కాయి. అందువల్ల వీసా పిటిషన్ ఫీజులను పెంచితే, భారతీయ ఐటీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు దరఖాస్తు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతానికి పాత ఫీజులే కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులకు నియమించుకోవడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.















