అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శక్తిమంతమైన పసిఫిక్ తుపాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని పలు నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతుండటంతో వరదలు పోటెత్తాయి. వరదలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. పలుచోట్ల భారీగా బుదర పోటెత్తింది. వాహనాలు బుదర నీటిలో చిక్కుకుపోయాయి. బలమైన గాలులకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. పలు చోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న పసిఫిక్ తీర హైవేను అధికారులు మూసివేశారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.