యావత్ ప్రపంచం కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే అగ్ర రాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లియాన్స్‌లో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఉగ్రదాడి జరిగింది. వైట్ పికప్ ట్రక్‌లో వెళుతున్న వ్యక్తి బ్యారికేడ్ల మీదుగా దూసుకెళ్లాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపు తున్న బౌర్బోన్ స్ట్రీట్‌లో భారీగా గుమిగూడిన ప్రజల మీదుగా ట్రక్ నడిపించాడు. దీంతో పది మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయని న్యూ ఓర్లియాన్స్, ఫెడరల్ పోలీసు అధికారులు తెలిపారు.
నిందితుడు శరవేగంతో ట్రక్ నడుపుతూ వెళ్లాడని, ప్రజలపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారికి రైఫిల్ తో కాల్చి చంపాడని చెప్పారు. ఈ ఘటనను న్యూ ఓర్లియాన్స్ మేయర్ లాటోయా కాంట్రెల్ ఉగ్రవాద దాడి అని చెప్పారు. దీనిపై ఎఫ్‌బీఐ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ దాడిలో గాయపడిన 30 మంది క్షతగారులను సమీప దవాఖా నలకు తరలించామని న్యూ ఓర్లియన్స్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ తెలిపింది.