అమెరికాలో దారుణం జరిగింది. పందెంలో గెలిచిన డబ్బులు కొట్టేయడానికి ప్రవాస భారతీయుడిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఇందుకోసం క్యాసినో నుంచి 80 కిలోమీటర్లు ఫాలో అయి ఇంటికి వెళ్లి మరీ చంపడం విషాదం. ఇండియాకు చెందిన అరవపల్లి శ్రీరంగ అమెరికాలోని న్యూయార్క్ ఫ్లెయిన్స్‌బరోలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఆరెక్స్ ల్యాబొరేటరీ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన ఇంటికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్సెల్వేనియాకు వెళ్లిన శ్రీరంగ పార్క్ క్యాసినో ఆడి దాదాపు 7.4 లక్షలు ( 10 వేల అమెరికన్ డాలర్లు) గెలుచుకున్నాడు. ఇది గమనించిన ఓ దుండుగుడు శ్రీరంగను ఫాలో అయ్యాడు. అతని కారు వెనుక అనుసరిస్తూ అతని ఇంటికి వెళ్లాడు.
శ్రీరంగ ఇంట్లోకి వెళ్లగానే బ్యాక్‌డోర్ పగులగొట్టుకుని ఇంటికి లోపలికి వెళ్లాడు. డబ్బుల కోసం శ్రీరంగతో జరిగిన ఘర్షణలో అతనిపై కాల్పులు జరిపి దుండగుడు పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీరంగ ఇంటికి వచ్చిన పోలీసులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే ఆయన మృతి చెందాడు. నిందితుడిని జెకై రీడ్ జాన్‌గా స్థానిక పోలీసులు గుర్తించారు. అతన్ని పెన్సెల్వేనియాలో అరెస్టు చేసి న్యూజెర్సీ పోలీసులకు అప్పగించారు. అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.